పెళ్ళి: ఇస్లాం మతం మారిన విశాల్ మరదలు..!


 'పందెం కోడి' లో విశాల్ కు మరదల గా నటించిన నటి మోనిక పెళ్లి ఈ నెల 11న చెన్నైలో జరగనుంది. ‘చంటి’ తదితర చిత్రాల్లో బాల తారగా కనిపించి, అటుపై ‘శివరామరాజు’ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించి, తెలుగులో ‘మా అల్లుడు వెరీగుడ్డు’ తో పాటు పలు చిత్రాల్లో కథానాయికగా చేసింది నటి మోనిక . గత ఐదారేళ్లుగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైన మోనిక త్వరలో ఇల్లాలు కాబోతోంది. ఈ నెల 11న మాలిక్ అనే వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగనుంది. గత ఏడాది ఇస్లాం మతానికి మారి, తన పేరుని రహీమాగా మార్చుకున్నారు మోనిక. మాలిక్ ముస్లిమ్ కాబట్టి, తనకోసమే మార్చుకుందని అప్పట్లో ఓ వార్త వచ్చింది. అయితే, ఆ సంప్రదాయం అంటే ఇష్టం కాబట్టే మారానని ఆమె పేర్కొన్నారు. మాలిక్‌తో ఆమె పెళ్లి ఇస్లాం పద్ధతిలో జరగనుంది.  

 తమిళంలో మంచి గుర్తింపు ఉన్న మోనికా బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా ఆమె అవార్డు అందుకున్నారు. మళయాల చిత్ర సీమలో పరవన అనే స్ర్కీన్ నేమ్‌తో పలు చిత్రాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆమె సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు.  పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని మోనిక నిర్ణయించుకున్నారు.