ఖైదీ నెంబర్ 150 తెలుగు మూవీ రివ్యూ (3.5/5.0)

  • AwaitNews
  • Rating :
  • 3.5
తారాగణం: చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా
దర్శకత్వం: వి. వి. వినాయక్
నిర్మాత: రామ్ చరణ్, ఎ. సుబస్కరణ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ: 11 జనవరి 2017
ఖైదీ నెంబర్ 150- చిత్ర కథ
కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.

మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను. శంకర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి పూర్వాపరాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది.

రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.
ఖైదీ నెంబర్ 150 - నటీనటుల ప్రతిభ
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదేళ్ల గ్యాప్ వచ్చినా.. ఆయనలో అదే ఠీవీ, ఎనర్జీ, నటనా ప్రతిభ కనిపిస్తుంది. అసలు ఆయన్ను 'మెగాస్టార్' ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్లలో పలికే హావభావాలు, డ్యాన్స్, యాక్షన్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ ఆయన చూపిన ప్రతిభకి మార్కులు వేయడానికి అంకెలు సరిపోవు. హీరోయిన్గా కాజల్ ఎప్పట్లానే తన అందంతోనూ, నటనతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన తరుణ్ అరోరా అద్భుత అభినయం చూపించాడు. నెగెటివ్ షేడ్స్ పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, ఆలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆడియెన్స్‌ని నవ్వించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇతర నటీనటులు తమ పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు.
ఖైదీ నెంబర్ 150 - సాంకేతికవర్గం పనితీరు
ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రఫర్స్లో రత్నవేలు ఒకడు. హీరోలు ఎలివేట్ అయ్యేలా చూపించడంలోనూ, ప్రతి ఫ్రేమ్‌ని కలర్ఫుల్గా, గ్రాండ్‌గా చూపించడంలో తన టాలెంట్ ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్నాడు. ఈ మూవీలోనూ అతను కెమెరా పనితనానికి మెచ్చుకోలేక ఉండలేరు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క బాగుంది. రాంచరణ్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. చాలా లావిష్‌గా తన తండ్రి చిత్రాన్ని నిర్మించాడు. ఇక వినాయక్ గురించి మాట్లాడితే.. ఈ రీమేక్ చిత్రాన్ని ఒరిజినాలిటీ మిస్ కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చిరు ఇతనిపై ప్రశంసల వర్షం ఎందుకు కురిపించారో.. సినిమా చూశాక అర్థం అవుతుంది. జనాలు ఏదైతే కోరుకున్నారో.. ఆ ఔట్పుట్ రాబట్టడంలో పాసయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చిరులాగే వినాయక్ కూడా బ్యాక్ అని చెప్పుకోవచ్చు.
ఖైదీ నెంబర్ 150 - చిత్ర విశ్లేషణ
ఈ సినిమా కోసం ఎవ్వరూ పెద్దగా రిస్క్ చేయలేదు. తమిళ కత్తి సీన్లను ఇక్కడ జిరాక్స్‌గా దించేసి మధ్యలో బ్రహ్మీ కామెడీ ఎపిసోడ్‌ను మాత్రమే వాడారు. అయితే అది అంతగా పేలలేదు. ఓరకంగా బ్రహ్మీ కామెడీ సీన్లు సినిమా ప్లో స్పీడ్‌ను తగ్గించాయి. ఫస్టాఫ్‌లో చిరు-ఆలీ-బ్రహ్మీ మధ్య వచ్చే సీన్లతో పాటు కాజల్-చిరు సీన్లతోనే ఎక్కువుగా సినిమా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ఊపందుకున్న సినిమాలో మెయిన్ స్టోరీ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంటుంది. సెకండాఫ్‌లో నీరూరు రైతుల సమస్యల కోసం చిరు వృద్ధులతో కలిసి హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై చేసే పైపుల్లో కూర్చుని నీరు వెళ్లకుండా అడ్డుకుంటూ సమస్యను అందరికి తెలిసేలా చేస్తాడు. చివరకు శీనుకు బదులుగా శిక్ష అనుభవిస్తోన్న శంకర్ జైలు నుంచి ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇక లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌లో చెర్రీ స్టెప్పులు మెగాఫ్యాన్స్కు సర్ఫ్రైజ్ గిఫ్ట్. వినాయక్ సినిమా అంతా ప్లాట్ నెరేషన్‌తోనే నడిపించాడు.
ఖైదీ నెంబర్ 150 - ట్రైలర్

ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ కొరకు ఇచ్చట క్లిక్క్ చేయండి