హెల్మెట్ లేకుంటే..ఇకపై కేసు నమోదు.. చలానాలు..!సైబరాబాద్ పరిధిలో ద్విచక్రవాహనదారులకు తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సైబరాబాద్ పరిధిలో రోడ్డెక్కాలంటే ద్విచక్ర వాహనదారులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇంతకుముందు ఈ నిబంధన ఉన్నా ఎక్కడా సరిగా అమలు కాలేదు. కానీ, ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ కావడం, నగర శివార్లటలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఘటనలో ఎక్కువగా ప్రమాదాల బారినపడడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. 

మొదట వాహనదారుల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి(బుధవారం) నుంచి 12వ తేదీ వరకు సైబరాబాద్ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించనున్నారు. ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ ఏసీపీలు, 12 ఠాణాల ఇన్‌స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.  వారోత్సవాల్లో భాగంగా ���ివార్లలోని కళాశాలల విద్యార్థులకు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తారు. 

ఇకపై కేసు నమోదు.. చలానాలు..

డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను 300కు తగ్గించగలిగారు. ఇక హెల్మెట్‌లపై కూడా ఇదే రకమైన తనిఖీలు నిర్వహించి ఈసారి ప్రమాద మృతుల సంఖ్యను భారీగా తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకపక్క అవగాహన కల్పిస్తూనే మరో పక్క మోటారు వాహనాల చట్టం -1988 ప్రకారం చలానాలు విధించడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తే కేసులు నమోదు చేసి, చలానా విధించేవారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీని వల్ల నగర రోడ్లపై ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. 

 హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోండి

 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే కొనుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో చాలా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.               

- డీసీపీ మహంతి       

-సాక్షి సౌజన్యంతో